దేశంలో కరోనా వైరస్‌తో మరణిస్తున్న వారి సంఖ్య 3.3 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వయసుల వారిగా మరణాల రేటును ఆయన తెలిపారు. 0-45 ఏళ్ల మధ్య ఉన్న వారు 14.4 శాతం, 45-60 ఏళ్ల మధ్య ఉన్న వారు 10.3 శాతం, 60-75 ఏళ్ల మధ్య ఉన్న వారు 33.1 శాతం, 75 ఏళ్లకు పైబడిన వారు 42.2 శాతం మరణిస్తున్నారని అగర్వాల్ చెప్పారు. వైరస్ సంక్రమణ రేటు 83 శాతం ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 1992 మంది వైరస్ చికిత్స పొంది కోలుకున్నారన్నారు. కోలుకున్నవారి సంఖ్య 13.85 శాతంగా ఉందన్నారు. గత 24 గంటల్లో కొత్తగా 991 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయన్నారు. దీంతో మొత్తం సంఖ్య 14,378కి చేరుకున్నదన్నారు. ఇక దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 480కి చేరిందన్నారు.
దేశంలో కరోనా మృతుల రేటు 3.3 శాతమే..