కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం స్తంభించిపోవటంతో ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగుతున్నప్పటికీ ఒక రకంగా మంచే జరుగుతున్నది అంటున్నారు పర్యావరణ వేత్తలు. దేశాలకు దేశాలే లాక్‌డౌన్లు ప్రకటించటంతో జనంమొత్తం ఇండ్లకే పరిమితమయ్యారు. దాంతో దాదాపు 90శాతం వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అంతేకాదు పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. సాధారణ రోజుల్లో అయితే వీటి ద్వారా రోజూ కొన్ని లక్షల టన్నుల కలుషిత వాయువులు గాలిలో కలుస్తుంటాయి. కానీ ఇప్పుడు అవన్నీ ఆగిపోవటంతో గాలిలో కాలుష్యం పాళ్లు తగ్గుతున్నదని శాస్ర్తవేత్తలు అంటున్నారు.
ఇటీవల అమెరికాకు సంబంధించిన వాయు నాణ్యతపై యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్ సెంటనెల్-5పీ తీసిన ఫొటోల్లో గాలిలో నైట్లోజన్ డైఆక్సైడ్ శాతా భారీగా తగ్గినట్లు తేలింది. 2019 డిసెంబర్‌తో పోల్చితే 2020 మార్చి 20 నాటికి లాస్ ఏంజెల్స్, న్యూయార్క్ నగరాల్లో గాలిలో కాలుష్యం మార్పు స్పష్టంగా కనిపించింది. గాలిలో నైట్రోజన్ డైఆక్సైడ్ శాతం పెరిగితే మనుషులకు శ్వాస సమస్యలు, జలుబు, బ్రాంకైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి.
కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనాలోనూ లాక్‌డౌన్ కారణంగా వాయుకాలుష్యం చాలావరకు తగ్గిందని, వుహాన్, బీజింగ్, షాంఘై వంటి నగరాల్లో విజిబులిటీ పెరిగిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. భారత్‌లో కూడా గత నాలుగు రోజులుగా లాక్‌డౌన్ నడస్తున్నది. ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత్‌లోనివే ఎక్కువ ఉండటంతో ఇక్కడ కూడా కాలుష్యం తగ్గనుందని, గాలి నాన్యత పెరుగుతుందని పర్యావరణ వేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.