‘బాలాకోట్‌'కు ఏడాది

బాలాకోట్‌ దాడులకు ఏడాది నిండింది. గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రవాదులు దాడిచేసి 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా ఫిబ్రవరి 26న భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన యుద్ధ విమానాలు సరిహద్దు దాటి బాలాకోట్‌లోని జైషే మమ్మద్‌ ఉగ్రవాద శిబిరంపై బాంబులు కురిపించాయి. ఈ ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం దేశవ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. ‘దేశం ఈరోజు బాలాకోట్‌ దాడుల మొదటి వార్షికోత్సవ సంబురాలు చేసుకుంటున్నది. ఇది ఉగ్రవాదంపై ఐఏఎఫ్‌ విజయానికి గుర్తు’ అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు ఐఏఎఫ్‌ చీఫ్‌ ఆర్కేఎస్‌ బధౌరియా శ్రీనగర్‌ ఎయిర్‌బేస్‌లో మిగ్‌-21 యుద్ధ విమానాన్ని నడిపారు.