కెరీర్‌లో తొలి మ్యాచ్‌..తొలి ఓవర్లోనే హ్యాట్రిక్‌

మధ్యప్రదేశ్‌ క్రికెటర్‌ రవి యాదవ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో  అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అరంగేట్రం మ్యాచ్‌  తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.  కెరీర్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న అతను తొలి ఓవర్లోనే హ్యాట్రిక్‌ నమోదు చేయడం విశేషం.  28ఏండ్ల లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ యాదవ్‌ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌.  తొలి ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లు వేసిన రవి 5 వికెట్లు పడగొట్టడంతో ఉత్తర్‌ప్రదేశ్‌ 216 పరుగులకే కుప్పకూలింది. 16 ఓవర్లలో ఏకంగా ఐదు ఓవర్లు మెయిడిన్‌ వేయడం విశేషం.  యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వరుస బంతుల్లో ఆర్యన్‌ జుయాల్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, సమీర్‌ రిజ్వీలను పెవిలియన్‌ పంపాడు.  జట్టు స్కోరు 15వద్ద మూడు కీలక వికెట్లు చేజార్చుకోవడంతో ఉత్తర్‌ప్రదేశ్‌ భారీ స్కోరు చేయలేకపోయింది. రవి స్పెషల్‌ హ్యాట్రిక్‌ వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.